ఫార్మాసిటీకి సాయంచేయండి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఫార్మాసిటీ (హెచ్‌పీసీ)కి పెద్దఎత్తున ఆర్థికసహాయం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఫార్మాసిటీని జాతీయ పెట్టుబడి తయారీజోన్ (నిమ్జ్)గా సూత్రప్రాయంగా గుర్తించిన నేపథ్యంలో ఆ మార్గదర్శకాల ప్రకారం ఆర్థికసాయంతోపాటు ఇతర సౌకర్యాలను కల్పించాలన్నారు. మౌలిక సదుపాయాల కోసం గ్రాంట్ రూపంలో ఆర్థిక సహాయం ప్రకటించాలని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల మంత్రి పీయూష్ గోయల్‌కు.. ఫార్మాసిటీకి అవసరమైన సహజవాయువును ప్రిఫరెన్షియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాలని కోరుతూ పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతి పెద్ద సమీకృత ఫార్మాపార్క్ అని మంత్రి కేటీఆర్ తన లేఖల్లో పేర్కొన్నారు.


దేశంలో ఫార్మారంగ అభివృద్ధికి ఈ పార్క్ దోహదపడుతుందని, జాతీయ ప్రాధాన్యంగల ప్రాజెక్టుగా ఫార్మాసిటీని కేంద్రం గుర్తించిందని తెలిపారు. హెచ్‌పీసీకి జాతీయ అంతర్జాతీయ ఫార్మా కంపెనీల నుంచి మంచి స్పందన లభిస్తున్నదని, ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు సుముఖంగా ఉన్నాయని వివరించారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో ఫార్మాసిటీ అంతర్జాతీయ ఫార్మారంగంలో భారతదేశపు నాయకత్వ స్థాయిని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. ఫార్మాసిటీకి కేంద్రం మద్దతునివ్వాలని మంత్రి కేటీఆర్ తన లేఖల్లో కేంద్ర మంత్రులను కోరారు.