ఏడు జిల్లాల్లో భారీ వర్షం

ఉపరితల ఆవర్తన ద్రోణుల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలతోపాటు గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురువగా ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో ఓ మోస్తరు వాన పడిం ది. ములుగు జిల్లా మేడారంలో వరద నీటిలో నుంచి వెళ్తుండగా విద్యుదాఘాతానికి రైతు మృతిచెందాడు. అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో 11.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వర కు వర్షం కురిసింది. గణపురం మండలంలో మోరంచవాగు పొంగిపొర్లుతున్నది. మహాముత్తారం మండలంలో దౌతుపల్లి వాగు బ్రిడ్జిపై నుంచి నీరు పొంగుతుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఓపెన్‌కాస్టు సెక్టార్- 2లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.