తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాప ప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్య తీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి. నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే! నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే! బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ! పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ! ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్ అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి. తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.
తులసి పూజ ఎలా చేయాలి?