ప్రజలను భాగస్వామ్యం చేయాలి

జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తేతెలంగాణ : పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా కార్యక్రమా లు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో సీఎన్‌జీ ఫంక్షన్‌హాల్‌లో కలెక్టర్‌ శ్రుతి ఓఝా అధ్యక్షతన నిర్వహించిన పల్లెప్రగతి పంచాయతీరాజ్‌ సమ్మేళనానికి ఎంపీ రాములు, జెడ్పీ చైర్మన్‌ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, డాక్టర్‌ వీఎం అబ్రహంలో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజ న్‌ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర పోరాటం, తెలంగాణ పోరాటాలు ప్రజలు భాగస్వామ్యం చేయడం వలనే విజయాలను సాధించగలిగామని ఆయన గుర్తు చేశారు. ఇదే స్పూర్తితో అధికారులు, ప్రజాప్రతినిధులు పల్లెప్రగ తి కార్యక్రమంలో ప్రజలను భాగస్వామ్యం చేసిన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రగతి కోసం ప్రతి ఒక్క పౌరుడూ తన వంతు కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎలాంటి టెక్నాలజీ అందుబాటలో లేని కాలంలోనే కాకతీయ రాజులు ఎన్నో కోటలను, లక్షా 20వేల చెరువులను నిర్మాణాలు చేపట్టిన చరిత్రలున్నాయని చెప్పారు. ఆకాలంలోనే సాధ్యమైన పనులు ఈ ఆధునిక కాలంలో సాధ్యం కావడం ఎంతో తేలికని చెప్పుకొచ్చారు. ఉన్నతమైన లక్ష్యాలను నిర్ణయించుకొని గ్రామాల ప్రగతి కోసం కార్యదర్శులు, సర్పంచులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా ప్రతి గ్రామీణపౌరునికి ఏడాదికి రూ.1655 అందిస్తుందని వీటిని సద్వినియోగ పరుచుకొని అభివృద్ధి చేయాలన్నారు. ఇక గ్రామాల్లో ప్రభుత్వ పనులకు అడ్డంకిగా మారిన ఇసుక కొరతను వెంటనే పరిష్కరించాలని ఆయన కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటు రహదారుల సరిహద్దులు గుర్తించి హరితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. గ్రామం పంచాయతీ నిధులను అవసరాన్ని బట్టి మళ్లీంచి నిర్మాణాలకు విని యోగించుకునేలా సదుపాయం ఆచరణ చేపట్టాలన్నారు.