తెలంగాణలో రెండో దశ వైరస్ విజృంభణ

 తెలంగాణలో రెండో దశ వైరస్ విజృంభణ


  

-ఒక్కరోజే ఆరుగురు బలి

-10వేలు దాటిన యాక్టివ్ కేసులు


తెలంగాణలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి వేగంగా సాగుతున్నది. కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తోన్న కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయికి చేరాయి. గ్రేటర్ హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లోనే వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. నిన్న ఒక్కరోజే 62,350 శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 1495 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,14,715కు పెరిగింది. వైరస్ రెండో దశ విజృంభణలో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా ఏకంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మరణాల సంఖ్య 1,729కి పెరిగింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.54శాతంగా ఉన్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. కాగా, కొత్తగా 245 మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో డిశ్చార్జీల సంఖ్య 3,02,013కు పెరిగింది. రాష్ట్రంలో రికవరీ రేటు 96.27గా ఉంది. కొత్త కేసుల ఉధృతి కారణంగా యాక్టివ్ కేసులు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 9,983 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. అందులో 5,323 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 313 జీహెచ్‌ఎంసీ పరిధిలో రాగా, మేడ్చల్ జిల్లాలో 160 కేసులు, రంగారెడ్డి 125, నిజామాబాద్ జిల్లాలో 140 కొత్త కేసులు వచ్చాయి.