ఒలింపిక్స్‌లో భారత్‌కి ఫస్ట్ గోల్డ్‌మెడల్..నీరజ్‌ చోప్రా అద్భుతం


- టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి మొదటి స్వర్ణ పతకం

- జావెలిన్ త్రో‌లో స్వర్ణం గెలిచిన నీరజ్ చోప్రా

- అభినవ్ బింద్రా తర్వాత పసిడి గెలిచిన రెండో భారతీయుడు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి భారత్‌ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించాడు. జావెలిన్‌ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. తద్వారా 100 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున అథ్లెటిక్స్‌ ఫీల్డ్‌ అండ్‌ ట్రాక్‌ విభాగంలో పతకాన్ని అందించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కాడు.

            మ్యాచ్‌ విషయానికొస్తే ఫురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో శనివారం పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని గెలుపొందాడు. ఫస్ట్ ప్రయత్నంలోనే 87.03 మీటర్లు జావెలిన్‌ని విసిరిన నీరజ్ చోప్రా.. ఆ తర్వాత రెండో ప్రయత్నంలో 87.58మీ, మూడో ప్రయత్నంలో 76.93మీ విసిరాడు. నాలుగో ప్రయత్నంలోనూ 80మీ దగ్గరగా జావెలిన్‌ని నీరజ్ చోప్రా విసిరాడు. కానీ.. అది ఫాల్ అయ్యింది. ఐదో ప్రయత్నంలోనూ అలానే జరిగింది. ఇక చివరి ప్రయత్నంలో మాత్రం 84.24 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. పసిడి పతక సంబరాలు మొదలెట్టాడు. చివరి అటెంప్ట్‌కి రెండు నిమిషాల ముందే నీరజ్ చోప్రాకి స్వర్ణం ఖాయమైపోయింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించగా.. ఆ తర్వాత వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచిన రెండో భారత క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా అరుదైన ఘనత సాధించాడు.  

హర్యానాకు చెందిన నీరజ్‌ చోప్రా పానిపట్‌ జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్‌ 24న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్‌ చిన్న వయసులోనే ఇండియన్‌ ఆర్మీకి సెలక్ట్‌ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయక్‌ సుబేదార్‌గా పనిచేస్తోన్నాడు. 2018 ఏషియన్‌ గేమ్స్‌లో జావెలిన్‌ త్రో  ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్‌ స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.