తెలంగాణాలో నవంబర్ 30వ తేదిన ఎన్నికలు


తెలంగాణ
  సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు విడుద‌ల చేసింది. తెలంగాణలో నవంబర్ 30వతేదిన ఎన్నికల నిర్వహించనున్నారు.. డిసెంబర్ మూడో తేదిన ఓట్ల లెక్కింపు చేపడతారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. తెలంగాణ లో మొత్తం 119 నియోజకవర్గాల‌కు ఒకే విడ‌త‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం ఓట‌ర్ల సంఖ్య 3 కోట్ల 17 ల‌క్ష‌లు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన చీఫ్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 35,356 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. ఇందులో 14,464 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉండగా, 20,892 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో  సగటున 900 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. 27,798 కేంద్రాల్లో (78 శాతం) వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాట్లు చేసినన్నరు 80 సంవత్సరాలు దాటిన వ‌యోవృద్ధులు ఇంటి నుంచే ఓటు హ‌క్కు వినియోగించుకునేలా ఏర్పాటు చేస్తున్నామ‌ని వివ‌రించారు.   మహిళల కోసం  597 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాట్లు చేస్తున్నామని, అదేవిధంగా 644 మోడల్‌ కేంద్రాలు,  వికలాంగుల కోసం  120 పోలింగ్‌ కేంద్రాలను  ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.